అక్కడ మేము చాలా రోజులున్నాక, అగబు అనే ప్రవక్త యూదయనుండి వచ్చాడు. అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకొని ఈ విధంగా అన్నాడు: “‘ఈ నడికట్టు ఎవరిదో, అతణ్ణి యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కానివాళ్ళకు అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెపుతున్నాడు.” ఇది విని అక్కడి ప్రజలు, మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్ళవద్దని బ్రతిమలాడాము. పౌలు, “మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడ్తున్నారు? యేసు ప్రభువు పేరిట బంధింపబడటానికే కాదు, మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను!” అని సమాధానం చెప్పాడు. మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని మేమేమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము. కైసరియనుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని “మ్నాసోను” అనే అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. అక్కడ మా బస. మ్నాసోను సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్ళలో ఇతడు ఒకడు. మేము యెరూషలేముకు వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు. మరుసటి రోజు మేము పౌలుతో కలిసి యాకోబును చూడాలని వెళ్ళాము. అక్కడ సంఘ పెద్దలందరూ ఉన్నారు. పౌలు వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి తాను చేసిన కార్యాల వల్ల దేవుడు యూదులు కానివాళ్ళతో చేసిన వాటినన్నిటిని ఒక్కొక్కటి విడమరిచి చెప్పాడు. వాళ్ళా మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత పౌలుతో, “సోదరుడా! వేలకొలది యూదులు విశ్వాసులవటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం ముఖ్యమని వాళ్ళ అభిప్రాయం. కాని నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదలమని, కుమారులకు సున్నతి చేయించటం తప్పని, యూదుల ఆచారాలను పాటించవద్దని యూదులు కానివాళ్ళ మధ్య నివసిస్తున్న యూదులకు బోధించినట్లు వీళ్ళకు ఎవరో చెప్పారు. “ఏం చెయ్యాలి? నీవు వచ్చిన విషయం వాళ్ళకు తప్పక తెలుస్తుంది. అందువల్ల మేము చెప్పినట్లు చెయ్యి. మా దగ్గర మ్రొక్కుబడి ఉన్నవాళ్ళు నలుగురున్నారు. వీళ్ళను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్ళతో కలిసి శుద్ధీకరణ చేయి. వాళ్ళు తల వెంట్రుకలు తీయించుకోవటానికి అయ్యే డబ్బు చెల్లించు. అలా చేస్తే నీ గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువౌతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్ళకు తెలుస్తుంది. “ఇక యూదులుకాని భక్తుల విషయంలో మేమిదివరకే మా అభిప్రాయం తెలియచేసాము. వాళ్ళు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్ళకు వ్రాసి పంపాము: ‘విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు. రక్తాన్ని, గొంతు నులిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు. లైంగిక పాపము చేయరాదు’” అని అన్నారు. మరుసటి రోజు పౌలు వాళ్ళను పిలుచుకెళ్ళి వాళ్ళతో సహా శుద్ధి చేసుకొన్నాడు. ఆ తదుపరి యెరూషలేము మందిరానికి వెళ్ళి పూర్తిగా శుద్ధి కావటానికి ఎన్ని రోజులు వేచివుండాలో ప్రకటించాడు. చివరి రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వవచ్చని చెప్పాడు.
చదువండి అపొస్తలుల 21
వినండి అపొస్తలుల 21
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల 21:10-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు