అపొస్తలుల 13:26-41

అపొస్తలుల 13:26-41 TERV

“సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! దైవభీతిగల ఇతర ప్రజలారా! రక్షణ గురించి తెలియ చేసే సందేశాన్ని దేవుడు మనకు తెలియచేసాడు. కాని యెరూషలేము ప్రజలు, వాళ్ళ పాలకులు ఈ యేసును గుర్తించలేదు. యేసుకు మరణదండన వేయించి ప్రతి విశ్రాంతి రోజున చదివే ప్రవక్తల మాటలు నిజం చేసారు. ఆయనకు మరణదండన విధించటానికి వాళ్ళకు ఏ కారణం దొరక్కపోయినా ఆయనను చంపివేయించమని పిలాతును కోరారు. “లేఖనాల్లో ఆయన్ని గురించి వ్రాసిన విధంగా వాళ్ళాయనను చంపారు. ఆ తర్వాత సిలువనుండి క్రిందికి దింపి సమాధి చేసారు. కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఇదివరలో ఆయనతో కలిసి గలిలయనుండి యెరూషలేమునకు ప్రయాణం చేసిన ప్రజలకు చాలా రోజుల దాకా కనిపించాడు. “వాళ్ళు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానాన్ని యిప్పుడు వాళ్ళ సంతతియైన మన కోసం పూర్తి చేసాడు. యేసును బ్రతికించటంతో ఈ వాగ్దానం పూర్తి అయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని గురించి కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడివుంది: ‘నీవు నా కుమారుడవు! నేడు నేను నీకు తండ్రినయ్యాను.’ దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట, ‘నేను దావీదుకు తప్పక యిస్తానన్న పవిత్రమైన ఆశీస్సులను నీకిస్తాను’ అని అన్నాడు. మరొక చోట యిలా చెప్పబడింది: ‘నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనియ్యవు!’ “దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచుకొన్నాడు. అతడు చనిపోగానే అతణ్ణి అతని పూర్వికులతో సమాధి చేసారు. అతని దేహం మట్టిలో కలిసిపోయింది. కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు. మీరీ విషయం తెలుసుకోవాలి. యేసు ద్వారా మీ పాపాలు క్షమించబడుతాయని మేము ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని పాపాలనుండి, యేసు తనను నమ్ముకొన్న ప్రతి ఒక్కణ్ణీ క్షమిస్తాడు. ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్తపడండి: ‘పరిహాసం చేసే ప్రజలారా! ఆశ్చర్యం పొందండి! నశించకండి! ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది నేనొకటి చేయబోతున్నాను! మరొకరు చెప్పినా మీరు నమ్మరు.’”

అపొస్తలుల 13:26-41 కోసం వీడియో