అపొస్తలుల 10:24-33

అపొస్తలుల 10:24-33 TERV

ఆ మరుసటి రోజు వాళ్ళు కైసరియకు చేరుకొన్నారు. వీళ్ళు రానున్నారని తెలిసి కొర్నేలీ సన్నిహితులైన బంధువుల్ని తన యింటికి ఆహ్వానించాడు. పేతురు యింట్లోకి అడుగు పెడ్తుండగానే కొర్నేలీ అతనికి ఎదురు వెళ్ళి అతని కాళ్ళ ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. పేతురు అతనిని లేపుతూ, “లెమ్ము! నేను కూడా ఒక మనిషినే” అని అన్నాడు. పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ప్రజలు సమావేశమై ఉండటం చూసాడు. పేతురు వాళ్ళతో, “యూదుడు, యూదుడు కానివానితో కలిసి ఉండరాదనీ, అతని యింటికి వెళ్ళరాదనీ యూదుల న్యాయశాస్త్రం అంటుంది. ఇది తప్పని మీకందరికి తెలుసు. కాని ‘ఏ వ్యక్తినీ అధమంగా భావించరాదు. పరిశుభ్రత లేనివాడని అనకూడదు’ అని నాకు దేవుడు తెలియజేసాడు. కాబట్టి నా కోసం పిలవనంపగానే వచ్చాను. నన్నెందుకు పిలిచారో నేను యిప్పుడు కారణం అడగవచ్చా?” అని అన్నాడు. కొర్నేలీ యిలా చెప్పాడు: “నాలుగు రోజుల క్రితం యిదే సమయంలో యింట్లో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అప్పుడు పగలు మూడు గంటలు. అకస్మాత్తుగా తెల్లటి మెరిసే దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడు నాతో, ‘కొర్నేలీ! దేవుడు నీ ప్రార్థనల్ని విన్నాడు. నీవు పేదలకు చేస్తున్న దానాలను గుర్తించాడు. పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు. అతడిప్పుడు సీమోను అనే చెప్పులు కుట్టేవాని యింట్లో అతిథిగా ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టేవాని యిల్లు సముద్ర తీరాన ఉంది’ అని చెప్పాడు. మిమ్మల్ని పిలుచుకు రావటానికి తక్షణం మనుష్యుల్ని పంపాను. మీరొచ్చి మంచి పని చేసారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. మాకు చెప్పుమని ప్రభువు మీకాజ్ఞాపించినవన్నీ వినటానికి సిద్ధంగా ఉన్నాము.”

అపొస్తలుల 10:24-33 కోసం వీడియో