2 సమూయేలు 7:18-29

2 సమూయేలు 7:18-29 TERV

పిమ్మట దావీదు రాజు లోనికి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ప్రార్థనా పూర్వకంగా యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు, “యెహోవా, నా దేవా, నీకు నేనెందుకంత ముఖ్యుడనయ్యాను? నా కుటుంబం ఎందుకంత ప్రాముఖ్యం గలదయ్యింది? నన్నెందుకు అంత ముఖ్యమైన వాణ్ణిచేశావు? నేనొక సేవకుణ్ణి తప్ప మరేమీ కాను. కాని నీవు నా పట్ల చాలా కరుణతో వున్నావు. భవిష్యత్తులో నా కుటుంబానికి జరిగే కొన్ని మంచి విషయాలు కూడ చెప్పావు. యెహోవా, నా దేవా, నీవిలా ప్రజలతో ఎప్పుడూ మాట్లాడవు. మాట్లాడతావా? నేను నీతో ఎలా ఎల్లప్పుడూ మాట్లాడగలను? యెహోవా, నా దేవా, నేను కేవలం ఒక సేవకుడినని నీకు తెలుసు; ఈ అద్భుత కార్యాలన్నీ నీవు చేస్తానని అన్నావు గనుక జరిపి నిరూపించావు. పైగా నీవు చేయాలనుకున్న దానిలో ఇదొక పని! ఈ గొప్ప విషయాలన్నీ నాకు తెలపాలని నీవు నిశ్చయించావు. ఈ కారణంవలన నీవు గొప్పవాడవు, ఓ నా ప్రభువైన దేవా! యెహోవా నీకు నీవే సాటి. నీవంటి దేవుడు వేరొకరు లేరు. మాకై మేము ఇదంతా విన్నాము. “ఇశ్రాయేలీయులైన నీ ప్రజలవలె మరో జనం ఈ భూమిమీద లేదు. ఆ ప్రజలు అసాధారణమైన వారు. వారు ఈజిప్టులో బానిసలయ్యారు. కాని నీవు వారిని విముక్తి చేసి తీసుకొని వచ్చావు. వారిని నీ ప్రజలుగా చేశావు. ఇశ్రాయేలీయుల కొరకు నీవు గొప్పవైన, అద్భుతమైన క్రియలు నెరవేర్చావు. నీ దేశంకొరకు ఆశ్చర్యకరమైన పనులు చేశావు. ఇశ్రాయేలు ప్రజలను శాశ్వతంగా నీకు అతి సన్నిహితులైన స్వంత ప్రజలుగా చేసుకున్నావు. యెహోవా, నీవు వారి పవిత్ర దేవుడవు. “ప్రభువైన దేవా! ఇప్పుడు నీవు నీ సేవకుడినైన నా నిమిత్తం, మరియు నా కుటుంబం నిమిత్తం ఈ సంగతులు చేసెదనని వాగ్దానము చేసియున్నావు. నీవిచ్చిన వాగ్దానాలు శాశ్వతంగా నిజమయ్యేలా చేయుము! నా కుటుంబాన్ని శాశ్వతంగా ఒక రాజ కుటుంబంగా చేయుము. అప్పుడు నీ నామము మహిమాన్వితం చేయబడుతుంది. ప్రజలంతా, ‘సర్వశక్తిగల యెహోవా, ఇశ్రాయేలును పరిపాలించు దేవుడు. తన సేవకుడైన దావీదు కుటుంబం ఆయన సేవలో బలముతో కొనసాగుతుంది’ అని అందురు. “సర్వశక్తిమంతుడవైన యెహోవా! ఇశ్రాయేలీయుల దేవా నాకు చాలా విషయాలు విశదం చేశావు. ‘నా వంశాభివృద్దికి నీ ఆశీస్సులిచ్చావు.’ నీ సేవకుడనైన నేను అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యెహోవా, నా దేవా! నీవే దేవునివి. నీవి సత్యవాక్కులు. నీ సేవకుడనైన నాకు ఈ మంచి విషయాలన్నీ వాగ్దానం చేశావు. దయచేసి నా కుటుంబాన్ని దీవించు. నీ ముందు దానిని ఎల్లప్పుడూ వర్ధిల్లేలా చేయుము. యెహోవా, నా దేవా! నీవీ అద్భుత విషయాలు చెప్పావు. నీ దీవెనతో నా కుటుంబం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడియుండు గాక!”