2 సమూయేలు 22:2-20

2 సమూయేలు 22:2-20 TERV

యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు! సహాయంకొరకు నేనాయనను ఆశ్రయిస్తాను! ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ స్థలం! ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది! యెహోవా నా ఉన్నత దుర్గము ఆయన నా భద్రమైన తావు. నాకు కీడు రాకుండా కాపాడే రక్షకుడు! యెహోవా స్తుతింపబడుగాక! ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును! మృత్యు తరంగాలు నన్ను చుట్టుముట్టాయి, కష్టాలు ముంచుకొచ్చాయి. అవి నన్ను బెదరగొట్టాయి! సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి, మృత్యు మాయలో చిక్కుకున్నాను! నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను యెహోవాని అర్థించాను. అవును, నేను నా దేవుని పిలిచాను! ఆయన తన ఆలయంలో వున్నాడు, ఆయన నా మొరాలకించాడు; నా ఆక్రందన ఆయన చెవులను చేరింది. భూమి విస్మయం చెంది, కంపించింది, పరలోకపు పునాదులు కదిలి పోయాయి, యెహోవా కోపావేశుడైన కారణాన! ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగవెడలింది, ఆయన నోటి నుండి అగ్ని జ్వాలలు వెలువడ్డాయి. ఆకాశమును ఛేదించుకొని ఆయన భువికి దిగి వచ్చాడు! ఆయన ఒక కారు మేఘముపై నిలబడ్డాడు! యెహోవా కెరూబు దూతల మీద వేగంగా వచ్చాడు; అవును, ఆయన గాలి రెక్కలపై పయనించటం ప్రజలు చూసారు! యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు. ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు. ఆయన తేజస్సు బొగ్గులను మండింప చేసింది! యెహోవా ఆకాశంలో గర్జించాడు ఆ సర్వోన్నతుడు మాట్లాడాడు! యెహోవా బాణములు వేసి శత్రువులను చెల్లాచెదరు చేశాడు. యెహోవా మెరుపులను ప్రసరింప చేశాడు, వారు భయకంపితులై పారిపోయారు. అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ గలిగారు, భూమి పునాదులు బహిర్గతమయ్యాయి.! యెహోవా గర్జించగా అవన్నియూ జరిగాయి, ఆయన నాసికారంధ్రముల నుండి వెలువడిన వేడిగాల్పులకు అలా జరిగాయి! యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను పట్టుకున్నాడు! అనంత జలరాసుల నుండి నన్ను వెలికి తీశాడు; నాబద్ధ శత్రువు నుండి, నన్ను ద్వేషించు వారి నుండి ఆయన నన్ను కాపాడాడు. నా శత్రువులు నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి నుండి ఆయన నన్ను కాపాడాడు! నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు! నాకు నిర్భయత్వమును కలుగ జేశాడు. ఆయనకు నేను ప్రీతిపాత్రుడను గనుక ఆయన నన్ను కాపాడాడు. నేను న్యాయ బద్దమైన పనులు చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు