2 సమూయేలు 17:1-14

2 సమూయేలు 17:1-14 TERV

అహీతోపెలు అబ్షాలోముతో ఇంకా యిలా అన్నాడు: “ఇప్పుడు నన్ను పన్నెండు వేలమంది సైనికులను ఎంపిక చేసుకోనీయ్యి. ఈ రాత్రికి నేను దావీదును వెంటాడతాను. అతడు బాగా అలసిపోయి బలహీన పడ్డాక నేనతనిని పట్టుకుంటాను. అతనిని బెదరగొడతాను. దానితో అతనితో ఉన్న వారంతా పారిపోతారు. నేను రాజైన దావీదును మాత్రమే చంపుతాను. తరువాత ప్రజలందరినీ నేను నీ వద్దకు తీసుకొని వస్తాను. నీవు వెదకుతున్న వ్యక్తి (దావీదు) గనుక చనిపోతే, మిగిలిన ప్రజలంతా శాంతంగా తిరిగి వస్తారు.” ఈ పథకం అబ్షాలోముకు, మిగిలిన ఇశ్రాయేలు నాయకులకు మంచిదనిపించింది. అయినా అబ్షాలోము, “అర్కీయుడైన హూషైని పిలవండి. అతడేమి చెపుతాడో కూడా నేను వినదలిచాను” అని అన్నాడు. అబ్షాలోము వద్దకు హూషై వచ్చాడు. అహీతోపెలు సలహాను హూషైకు అబ్షాలోము వివరించాడు. దానిని అనుసరించవచ్చా? లేదా? తెలియజెప్ప మన్నాడు. హూషై ఈ విధంగా చెప్పాడు, “అహీతోపెలు ఇచ్చిన సలహా ఈ సమయంలో మంచిది కాదు.” నీ తండ్రి, అతని మనుష్యులు చాలా గట్టివారని నీకు తెలుసు. పొలాల్లో తన పిల్లల్ని పొగొట్టుకున్న ఎలుగు బంటివలె వారు మహా కోపంతో వున్నారు. నీ తండ్రి బహు నేర్పరియైన యోధుడు. అతను రాత్రంతా తన మనుష్యులతో కలిసి వుండడు. బహుశః ఈ పాటికి ఆయన ఏ గుహలోనో, మరొక చోటనో దాగి వుండవచ్చు. నీ తండ్రి గనుక నా మనుష్యులను ముందుగా ఎదుర్కొంటే, ప్రజలందరికీ ఆ వార్త తెలిసిపోతుంది. అబ్షాలోము అనుచరులు ఓడి పోతున్నారని వారంతా అనుకుంటారు! సింహాల్లా ధైర్యంగా వుండే నీ మనుష్యులు కూడ చెదరిపోయే అవకాశం వుంది. ఎందువల్లననగా ఇశ్రాయేలీయులంతా నీ తండ్రి బలవంతుడైన యోధుడనీ, ఆయన మనుష్యులు మంచి ధైర్యవంతులనీ ఎరుగుదురు! “నేను చెప్పేదేమంటే ఇప్పుడు నీవు దానునుండి బెయేర్షెబా వరకు వున్న ఇశ్రాయేలీయులనందరినీ చేరదియ్యి. సముద్ర తీరాన ఇసుక రేణువుల్లా నీ వద్ద అనేక మంది ప్రజలు వుంటారు. అప్పుడు నీకై నీవే యుద్ధానికి వెళ్ల వచ్చు. అతను దాగివున్న చోటులోనే మనం దావీదును పట్టుకోవచ్చు. భూమి మీదకు మంచు పడినట్లు మనం దావీదు మీద పడవచ్చు. దావీదును, అతని మనుష్యులందరినీ మనం చంపవచ్చు. వారిలో ఏ ఒక్కడూ వదిలిపెట్టబడడు. ఒకవేళ దావీదు నగరంలోకి తప్పించుకుంటే, ఇశ్రాయేలీయులంతా తాళ్లు పట్టుకు వస్తారు. ఆ నగరాన్నంతా మనం లోయలోకి లాగి వేద్దాం ఇక ఆ నగరంలో ఒక్క చిన్న రాయి కూడ మిగలదు!” “అర్కీయుడైన హూషై ఇచ్చిన సలహా అహీతోపెలు సలహాకంటె చాలా బాగుందని,” అబ్షాలోము, ఇతర ఇశ్రాయేలీయులంతా అన్నారు. ఇదంతా యెహోవా ఏర్పాటు గావున, వారంతా అలా చెప్పారు. యెహోవా అహీతోపెలు ఇచ్చిన మంచి సలహాను వ్యర్థంచేయ సంకల్పించాడు. ఆ విధంగా అబ్షాలోమును శిక్షింప జూశాడు.