2 రాజులు 6:25-33

2 రాజులు 6:25-33 TERV

నగరంలోకి ప్రజలు ఆహారం తీసుకురాకుండా సైనికులు చేశారు. అందువల్ల షోమ్రోనులో భయంకరమైన కరువు ఏర్పడింది. అది యెంత కష్టకాలమంటే, ఒక గాడిద తల ఎనభై వెండి రూపాయిలకు మరియు పావురపు పావు రెట్ట ఐదు వెండి రూపాయిలకు అమ్మబడింది. ఇశ్రాయేలు రాజు నగరాన్ని ఆవరించిన ప్రాకారము మీద నడుస్తున్నాడు. ఒక స్త్రీ అతనిని ఉద్దేశించి కేక పెట్టింది. “నా ప్రభువా, యజమాని! దయచేసి నాకు సహాయం చెయ్యండి” అని. ఇశ్రాయేలు రాజు, “యెహోవా కనుక సహాయం చేయకపోతే, నేను ఎలా సహాయం చేయగలను? నీకు ఇవ్వదగింది నావద్ద ఏమియులేదు, కళ్లంలో ధాన్యం లేదు. ద్రాక్షరసపు శాలలో ద్రాక్షరసం లేదు.” తర్వాత, “నీకు వచ్చిన కష్టమేమి?” అని ఇశ్రాయేలు రాజు అడిగాడు. ఆ స్త్రీ ఇలా బదులు చెప్పింది. “నీవు నీ కుమారుని మాకిచ్చివేయండి. అతనిని చంపి నేడు ఆహారం భుజిస్తాము. ఆ తర్వాత మేము మా కుమారుని రేపు భుజిస్తాము” అని ఈమె చెప్పింది. కాబట్టి మా కుమారుణ్ణి ఉడికించి తినేశాము. ఆ మరుసటి రోజు నేను ఆ స్త్రీని ఇలా అడిగాను: “నీవు నీ కుమారుని ఇమ్ము. మేము అతనిని చంపి నేడు భుజిస్తాము. కాని ఆమె తన కుమారుని దాచివేసింది.” ఆ స్త్రీ పలుకులు వినగానే, రాజు తాను తలక్రిందులైనానని దుఃఖాన్ని తెలపడానికి తన వస్త్రాలు చింపుకున్నాడు. ఆ గోడమీదుగా రాజు వెళ్తున్నప్పుడు రాజు గోనె పట్ట ధరించాడనీ, అది అతడు తల క్రిందులయిన, వ్యసనమయిన స్థితిని తెలుపుతున్నదని ప్రజలు గ్రహించారు. రాజు, “ఈరోజు ఆఖరికి షాపాతు కుమారుడైన ఎలీషా తల కనుక అతని దేహం మీద ఉంటే, నన్ను దేవుడు శిక్షించునుగాక!” అని చెప్పాడు. ఎలీషా వద్దకు రాజు ఒక దూతను పంపించాడు. ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. మరియు పెద్దలు (నాయకులు) అతనితోపాటు ఉన్నారు. ఆ దూత అక్కడికి చేరుకోవడానికి ముందుగా, పెద్దల్ని ఉద్దేశించి అతను ఇలా అన్నాడు: “చూడండి, ఆ హంతకుని కుమారుడు (ఇశ్రాయేలు రాజు) నా తల నరికి వేసేందుకు మనుష్యులను పంపిస్తున్నాడు. ఆ దూత చేరగానే, తలుపు మూసివేయండి తలుపు పట్టుకుని, అతనిని లోపలికి రానివ్వకండి. నేనతని యజమాని అడుగులు అతని వెనుక వస్తున్నట్టు ఆ సవ్వడి మనకు వినిపించునుగదా.” ఎలీషా ఆ పెద్దలతో (నాయకులతో) మాట్లాడుతూండగా, దూత అక్కడికి వచ్చాడు. ఆ సందేశమిది: “యెహోవా నుండి ఈ కష్టం వచ్చింది. ఇంకా యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.”