1 సమూయేలు 20:18-42

1 సమూయేలు 20:18-42 TERV

“రేపు అమావాస్య విందుగదా! అక్కడ నీ స్థానం ఖాళీగా వుంటుంది. కనుక నా తండ్రి నీవు రాలేదని గమనిస్తాడు. ఈ కష్టాలన్నీ ప్రారంభమైనప్పుడు నీవు ముందుగా ఎక్కడ దాగివున్నావో అక్కడికే మూడవ రోజున కూడ నీవు వెళ్లు. అక్కడ కొండ పక్కన వేచివుండు. మూడవ రోజున కొండ పక్కగా నేనొక గురిని బాణంతో కొడుతున్నట్టు నేను నటిస్తాను. నేను కొన్ని బాణాలు వదులుతాను. అప్పుడు ఆ వదిలిన బాణాన్ని వెదికేందుకుగాను ఒక కుర్రవానిని పంపుతాను. వానితో నేను ‘మరీ దూరం వెళ్లిపోయావు. బాణాలు అక్కడ నాకు దగ్గర్లోనే ఉన్నాయి గదా, వెనక్కు వచ్చేసి వాటిని తీసుకొనిరా’ అని చెబుతాను. నేను గనుక అలా చెబితే అప్పుడు నీవు బయటకి రావచ్చు. యెహెవా జీవిస్తున్నంత వాస్తవంగా నీకు క్షేమం కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాను. ప్రమాదం ఏమీ లేదు. కానీ ఒకవేళ ఏదైనా తొందర ఉంటే, ‘బాణాలు చాలా దూరంగా ఉన్నాయి. వెళ్లి వాటిని తీసుకురా’ అని ఆ కుర్రవానితో నేను అంటాను. నేను గనుక అలా చెబితే నీవు తప్పక పారిపోవల్సిందే. అంటే యెహోవా నిన్ను దూరంగా పంపుతున్నాడన్న మాట. మనిద్దరి మధ్యవున్న ఈ ఒడంబడిక జ్ఞాపకం ఉంచుకో. యెహోవా మనకు శాశ్వతంగా సాక్షి” అని యోనాతాను దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య విందు సమయం వచ్చింది. రాజు భోజనం చేయటానికి కూర్చున్నాడు. మామూలుగా కూర్చునే చోటులో గోడ దగ్గరగా రాజు కూర్చున్నాడు. సౌలుకు ఎదురుగా యోనాతాను కూర్చున్నాడు. సౌలుకు పక్కగా అబ్నేరు కూర్చున్నాడు. కానీ దావీదు స్థానం ఖాళీగా ఉంది. ఆరోజు సౌలు ఏమీ అనలేదు. “దావీదుకు ఏమైనా జరిగివుండవచ్చు; లేదా మైలపడి ఉండవచ్చు” అనుకున్నాడు. కానీ మరునాడు, అంటే ఆ నెల రెండో రోజున కూడా దావీదు స్థానం ఖాళీగావుంది. “యెష్షయి కుమారుడు నిన్న, ఈ రోజు కూడా అమావాస్యవిందుకు ఎందుకు రాలేదని సౌలు యోనాతానును” అడిగాడు. “బేత్లెహేము వెళ్లనిమ్మని దావీదు నన్ను అడిగాడు. అతని కుటుంబం వాళ్లున్న బేత్లెహేములో ఒక బలి అర్పణ ఇస్తున్నారని, అతడు చెప్పాడు. అతని సోదరుడు అతనిని రమ్మని పిలిచాడనీ, కాబట్టి తన సోదరులను చూడటానికి అనుమతి ఇమ్మని స్నేహితునిగా అడుగుతున్నాననీ దావీదు చెప్పాడు. అందుచేత దావీదు రాజు విందుకు రాలేక పోయాడు,” అని యోనాతాను చెప్పాడు. సౌలుకు యోనాతాను మీద చాల కోపం వచ్చింది, “మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడివి నీవు! నీవు ఆ స్త్రీలాగే ప్రవర్తిస్తున్నావు. నాకు తెలుసు నీవు దావీదు పక్షాన ఉన్నావని. నీకూ, నిన్ను కన్నతల్లికి తలవంపులు తెస్తున్నావు. యెష్షయి కుమారుడు బ్రతికి ఉన్నంత వరకూ నీవు రాజు కావటంగాని, రాజ్యాన్ని చేపట్టటం గాని జరుగదు. ఇప్పుడే దావీదును నా దగ్గరకు తీసుకునిరా! వాడు చచ్చిన వారితో సమానము!” అన్నాడు సౌలు. “దావీదును ఎందుకు చంపాలి? దావీదు చేసిన నేరం ఏమిటి?” అని యోనాతాను తన తండ్రిని అడిగాడు. సౌలు తన ఈటెను యోనాతాను మీదికి విసరి, అతనిని చంపటానికి ప్రయత్నం చేసాడు. దానితో తన తండ్రి నిజంగానే దావీదును చంపాలని తల పెట్టాడని యోనాతానుకు అర్థమయ్యింది. యోనాతానుకు విపరీతంగా కోపం వచ్చింది. భోజనాల బల్ల వదిలి వెళ్లిపోయాడు. యోనాతాను తన తండ్రి మీద చాల కోపంతో ఆ విందు రెండో రోజు కూడ ఏమీ భోజనం చేయటానికి ఒప్పుకోలేదు. సౌలు తనను పరాభవించినందుకు, దావీదును చంపాలని చూస్తున్నందుకు యోనాతాను కోపగించాడు. ఆ మరునాటి ఉదయం యోనాతాను పొలానికి వెళ్లాడు. వాళ్లనుకున్నట్లుగా దావీదును కలవటానికి అతడు వెళ్లాడు. యోనాతాను తన వెంట ఒక చిన్న పిల్లవానిని కూడ తీసుకొని వెళ్లాడు. “నేను వేసే బాణాన్ని పరుగున పోయి వెదికి తీసుకొనిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. ఆ పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని తల మీదగా అవతలికి బాణాలు వేశాడు. బాణాలు పడిన చోటుకి బాలుడు పరుగెత్తాడు. కానీ యోనాతాను “బాణాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి” అని అరిచాడు. “వెళ్లు! త్వరగా వెళ్లు! ఆ బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను కేకలు వేశాడు. ఆ బాలుడు బాణాలు తీసుకొని తన యజమాని వద్దకు తెచ్చాడు. ఈ సందర్భంలో ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో ఆ బాలునికి ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే అది తెలుసు. యోనాతాను తన విల్లు, అంబులను ఆ బాలునికి ఇచ్చి, “పట్టణానికి వెళ్లి పో” అని చెప్పాడు. ఆ కుర్రవాడు వెళ్లిపోయాక, కొండ ఆవలి ప్రక్క తాను దాగివున్న చోటనుండి దావీదు బయటకి వచ్చాడు. దావీదు యోనాతాను ముందు ప్రణమిల్లాడు. అలా మూడుసార్లు దావీదు చేశాడు. తరువాత దావీదు, యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. వారు ఇద్దరూ బాగా ఏడ్చారు. దావీదు యోనాతాను కంటె ఎక్కువగా ఏడ్చాడు. “శాంతితో వెళ్లు. మనము స్నేహితులుగా కొనసాగుతామని యెహోవా నామంలో వాగ్దానం చేసుకున్నాము. మనమధ్య, మన తరువాత మన తరాల వారి మధ్య యెహోవా శాశ్వతంగా సాక్షిగా ఉంటాడని మనము చెప్పుకున్నాము” అని యోనాతాను దావీదుతో అన్నాడు.