1 సమూయేలు 20:1-17

1 సమూయేలు 20:1-17 TERV

దావీదు రామాలో వున్న నాయోతునుంచి పారిపోయాడు. తిన్నగా యోనాతాను వద్దకు వెళ్లి, “నేనేమి తప్పు చేశాను? నా నేరం ఏమిటి? నీ తండ్రి ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు?” అని అడిగాడు. అది విన్న యోనాతాను ఇలా అన్నాడు, “నా తండ్రి నిన్ను చంపటానికి ప్రయత్నం చేయటం లేదు. నా తండ్రి ముందుగా నాకు చెప్పకుండా ఏ పనీచేయడు. అది అతి ముఖ్యమైన పనిగాని, లేక అతి స్వల్పమైన విషయంగాని మా తండ్రి ఎప్పుడూ నాకు చెబుతాడు. ఆయన నిన్ను చంపాలనే తన ఆలోచనను నాకెందుకు చెప్పకుండా ఉంటాడు? లేదు. అది నిజం కాదు!” కానీ దావీదు, “నేను నీ స్నేహితుడనని నీ తండ్రికి బాగా తెలుసు. యోనాతానుకు ఈ విషయం తెలియకూడదు అతనికి తెలిస్తే దావీదుకు చెప్పేస్తాడు అని నీ తండ్రి అనుకుని ఉంటాడు. దేవుడు జీవిస్తున్నాడు అన్నంత నిజంగా, నీవు జీవుస్తున్నావన్నంత నిజంగా నేను మృత్యువుకు చాలా చేరువలో ఉన్నాను.” అని జవాబిచ్చాడు. యోనాతాను, “సరే, ఇప్పుడు నీవు ఏమి చేయమంటే అది నేను చేస్తాను” అని దావీదుతో అన్నాడు. అప్పుడు దావీదు, “అయితే చూడు. రేపు అమావాస్య విందు. నేను రాజుతో కలిసి విందారగించవలసివుంది. కాని రేపు సాయంత్రం వరకు నన్ను పొలాల్లో దాగివుండనీ. నేను రాలేదని నీ తండ్రి గమనించినపుడు ‘దావీదు తన స్వగ్రామమైన బేత్లెహేముకు వెళ్లాలని కోరాడు. ఈ నెలసరి బలి అర్పణకు అతని కుటుంబంవారు స్వంతంగా విందు చేసుకోవాలని కోరారు. కనుక దావీదు తన కుటుంబంతో కలసి ఉండేందుకు తనను వెళ్లనివ్వాల్సిందిగా నన్ను అడిగాడు’ అని నీ తండ్రికి చెప్పు అన్నాడు. ‘సరే మంచిది’ అని మీ తండ్రి అంటే నేను హాయిగా ఉన్నట్లే. కానీ ఆయనకు కోపం వస్తే మాత్రం నాకు కీడు చేస్తాడని నీవు నమ్మవచ్చు. యోనాతానూ! నేను నీ సేవకుడను. నన్ను కనికరించు. యెహోవా ఎదుట నీవు నాతో ఒక ఒడంబడిక చేసావు. నేను దోషినయితే నీకై నీవే నన్ను చంపవచ్చు! కానీ నన్ను మాత్రం నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్లకు” అన్నాడు. యోనాతాను, “లేదు ఎప్పటికీ అలా జరగదు! నా తండ్రి నీకు కీడు తలపెడితే నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు. దావీదు, “నీ తండ్రి నిన్ను తిడితే అది నాకెవరు తెలియజేస్తారు?” అన్నాడు. అప్పుడు యోనాతాను, “అయితే, రా! మనం పొలంలోకి వెళదాము” అని అనగా యోనాతాను, దావీదు కలిసి పొలంలోకి వెళ్లారు. యెనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సమక్షంలో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా తండ్రి నీ విషయంలో ఏ తలంపుతో ఉన్నాడో తెలుసుకుంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ పట్ల ఆయన వైఖరి బాగుందో లేదో తెలుసుకుంటాను. ఆ విషయం మూడురోజుల్లో నీకు పొలానికి కబురు చేస్తాను. నా తండ్రి గనుక నీకు కీడు తలపెడితే, అది నీకు తెలియపర్చి, నిన్ను క్షేమంగా వెళ్లిపోనిస్తాను. ఇది నేను చేయకపోతే యెహోవా నన్ను శిక్షించునుగాక! యెహోవా నా తండ్రికి తోడై యున్నట్లు, నీకు కూడ తోడైవుండునుగాక! నేను జీవించినంత కాలం, నా మీద దయచూపించు. నేను మరణించాక నా కుటుంబంపట్ల నీ దయాదాక్షిణ్యాలు చూపించటం ఎన్నడూ మానవద్దు. ఈ భూమి మీద నీ శత్రువుల నందరినీ యెహోవా నాశనం చేయునుగాక! ఆ సమయంలో యోనాతాను కుటుంబం దావీదునుండి వేరు చేయబడాల్సి వస్తే, అలాగే జరుగనివ్వు. దావీదు శత్రువులను యెహోవా శిక్షించునుగాక!” అప్పుడు యోనాతాను తన మీద దావీదుకు ఉన్న ప్రేమ వాగ్దానాన్ని మరల చూపించమన్నాడు. ఎందువల్ల నంటే యోనాతాను తనను తాను ప్రేమించుకున్నంతగా దావీదును ప్రేమించాడు గనుక అలా చేశాడు.

Read 1 సమూయేలు 20