1 సమూయేలు 10:1-6

1 సమూయేలు 10:1-6 TERV

సమూయేలు ఒక పాత్రలో ప్రత్యేక నూనె తీసుకుని సౌలు తలమీద పోసాడు. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొని, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నిన్ను నాయకునిగా ఉండేందుకు అభిషేకించాడు. నీవు దేవుని ప్రజలకు ఆధిపత్యం వహించాలి. చుట్టూరా వున్న శత్రువుల బారినుండి వారిని నీవు కాపాడతావు. యెహోవా తన ప్రజల మీద పాలకునిగా ఉండేందుకు నిన్ను అభిషేకించాడు. ఇది సత్యమని ఋజువు చేసే గుర్తు ఇది. ఈ రోజు నీవు నా వద్దనుండి వెళ్లగానే బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహు వద్దనున్న రాహేలు సమాధి దగ్గర నీవు ఇద్దరు వ్యక్తులను కలుస్తావు. ‘నీవు వెదకబోయిన గాడిదలు దొరుకుతాయి. నీ తండ్రి గాడిదలను గూర్చి చింత పడటం మానేసాడు. ఇప్పుడు ఆయన నీ విషయంలో చింతిస్తున్నాడు. నా కుమారుని సంగతి నేనేమి చేయాలి? అని ఆయన అంటున్నాడు’” అని ఆ ఇద్దరు మనుష్యులు నీతో అంటారు. “ఆ తరువాత తాబోరు వద్ద సింధూర మహా వృక్షంవరకూ నీవు ఆగకుండా ప్రయాణం చేస్తావు. అక్కడ మళ్లీ ముగ్గురు మనుష్యులు నిన్ను కలుస్తారు. వారు బేతేలు పట్టణంలో దేవుని ఆరాధించటానికి వెళుతూఉంటారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను మోసుకొని వస్తాడు. రెండవ వానివద్ద మూడు రొట్టెలు ఉంటాయి. మూడవ వానివద్ద ఒక తిత్తినిండా ద్రాక్షారసం ఉంటుంది. ఆ ముగ్గురు వ్యక్తులూ నిన్ను పలకరించి రెండు రొట్టెలు నీకు ఇస్తారు. ఆ రెండిటినీ వారినుండి నీవు తీసుకుంటావు. తరువాత నీవు ఫిలిష్తీయుల కోటవున్న గిబియ-ఎలోహిముకు వెళతావు. నీవు ఆ పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన విషయాలు చెబుతూ వస్తారు. యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా వస్తుంది. నీలో గొప్ప పరివర్తనవస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నీవు కూడా దేవుని విషయాలు చెబుతావు.