ప్రతి ఏటా ఇదిలా జరుగుతూ వచ్చింది. షిలోహులోని యెహోవా ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ హన్నాను పెనిన్నా కించపరిచేది. ఒకరోజు ఎల్కానా బలి అర్పించుచుండగా హన్నా ఏడ్వసాగింది. భోజనం కూడా చేయలేదు. ఆమె భర్త ఎల్కానా, “ఎందుకు విచారిస్తున్నావనీ, ఎందుకు తినటం లేదనీ, ఎందుకు దుఃఖంతో ఉన్నావనీ ఆమెను అడిగాడు. నీకు నేను ఉన్నాను, నేను నీ భర్తను. పదిమంది కొడుకులకంటె నేను నీకు ఎక్కువ” అని కూడ ఓదార్చాడు. హన్నా అన్న పానాలు పుచ్చుకొన్న తర్వాత, యెహోవాను ప్రార్థించటానికి వెళ్లింది. యెహోవా పవిత్ర ఆలయ ద్వారం పక్కనే యాజకుడు ఏలీ ఆసీనుడైవున్నాడు. హన్నా మిక్కిలి విచారంతో ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి ప్రార్థించింది. ఒక పెద్ద మొక్కుబడి మొక్కింది. “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నేను ఎంత దుఃఖంలో వున్నానో చూడు. నన్ను జ్ఞాపకముంచుకో! నన్ను మర్చిపోవద్దు. నాకొక కుమారుని కలుగజేస్తే వానిని నేను తిరిగి నీ సేవకై జీవితాంతం విడిచి పెడ్తాను. పైగా అతడు మద్యపానాది వ్యసనాలకు లోనుగాడు. అతడు నాజీరవుతాడు. మరియు అతని తలవెంట్రుకలు ఎవ్వరూ కత్తిపట్టి తీయరు” అని కోరుకున్నది. ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. హన్నా అంతరంగంలోనే ప్రార్థిస్తూవుంది. ఆమె పెదవులు కదిలాయి గాని ఆమె గొంతు విప్పలేదు. అందుచేత హన్నా మద్యం సేవించి వుంటుందని ఏలీ భావించాడు. “మద్యం తాగటం మానివేయి. నీ ద్రాక్షా రసాన్ని పారబోయి” అని హన్నాతో ఏలీ చెప్పాడు. “లేదయ్యా, నేను ద్రాక్షారసం గాని, మరేదిగాని సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో చెప్పుకుంటున్నాను. నేనొక చెడ్డ స్త్రీ నని తలంచవద్దు. ఇంత ఎక్కువ సేపు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానంటే నాకు ఎన్నో బాధలు, అంతులేని దుఃఖం ఉన్నాయి” అని హన్నా సమాధాన మిచ్చింది. అంతట ఏలీ, “నీవు సమాధానంతో వెళ్లు. ఇశ్రాయేలు దేవుడు నీ కోర్కెలను నెరవేర్చునుగాక” అని హన్నాను పంపివేశాడు. “నామీద దయ ఉంచండి” అని చెప్పి హన్నా వెళ్లి, కొంచెం ఆహారం తీసుకున్నది. ఆ తరువాత ఆమె మరెప్పుడూ అంత మనోవేదన చెందలేదు. మరునాటి తెల్లవారు ఝామునే ఎల్కానా కుటుంబ సభ్యులంతా లేచి దేవుని ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి వెళ్లిపోయారు. ఎల్కానా తన భార్య హన్నాతో శయనించాడు. హన్నాను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు. మరు సంవత్సరం సమయానికి హన్నా గర్భవతియై, ఒక కుమారుని కని తన కుమారునికి సమూయేలు అని పేరు పెట్టింది. “వీనిపేరు సమూయేలు. ఎందుకంటే వీని కొరకు నేను యెహోవాని ప్రార్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు” అని అన్నది హన్న.
Read 1 సమూయేలు 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 1:7-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు