1 సమూయేలు 1:1-28

1 సమూయేలు 1:1-28 TERV

ఎల్కానా అనబడే ఒక వ్యక్తి ఉండెను. అతను కొండల దేశమైన ఎఫ్రాయిములోని రామతయి మ్సోఫీము పట్టణవాసి. ఎల్కానా సూపు వంశస్థుడు. అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు యొక్క కుమారుడు. ఎలీహు తండ్రి తోహు. తోహు ఎఫ్రాయిము వంశపువాడైన సూపు కుమారుడు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు హన్నా. రెండవ భార్యపేరు పెనిన్నా. పెనిన్నా సంతానవతి. కాని హన్నాకు పిల్లలు కలుగలేదు. ప్రతి సంవత్సరము ఎల్కానా రామతయి మ్సోఫీమునుండి షిలోహుకు వెళ్లి సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించేవాడు. అక్కడ అతను బలులు కూడ అర్పించేవాడు. షిలోహులో హొఫ్నీ, మరియు ఫీనెహాసు అనే వారిరువురు యెహోవా యాజకులుగా ఉండిరి. వారిరువురూ ఏలీ అనే ప్రధాన యాజకుని కుమారులు. ప్రతిసారీ బలిఅర్పణలో ఒక భాగం ఎల్కానా తన భార్య పెనిన్నాకు ఇచ్చేవాడు. ఆమె కుమారులకు కూడా భాగాలు ఇచ్చేవాడు. యెహోవా హన్నాను గొడ్రాలుగా చేసినప్పటికీ, ఎల్కానా మాత్రం ఆమెను బాగా ప్రేమించేవాడు గనుక ఆమెకు కూడ ఎల్లప్పుడు అర్పణలో సమానభాగం ఇచ్చేవాడు. పెనిన్నా అదేపనిగా హన్నాను పీడిస్తూ ఆమె మనస్సుకు ఎంతో బాధ కలిగించేది. అందుకు కారణం దేవుడు ఆమెను గొడ్రాలుగా చేయటమే. ప్రతి ఏటా ఇదిలా జరుగుతూ వచ్చింది. షిలోహులోని యెహోవా ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ హన్నాను పెనిన్నా కించపరిచేది. ఒకరోజు ఎల్కానా బలి అర్పించుచుండగా హన్నా ఏడ్వసాగింది. భోజనం కూడా చేయలేదు. ఆమె భర్త ఎల్కానా, “ఎందుకు విచారిస్తున్నావనీ, ఎందుకు తినటం లేదనీ, ఎందుకు దుఃఖంతో ఉన్నావనీ ఆమెను అడిగాడు. నీకు నేను ఉన్నాను, నేను నీ భర్తను. పదిమంది కొడుకులకంటె నేను నీకు ఎక్కువ” అని కూడ ఓదార్చాడు. హన్నా అన్న పానాలు పుచ్చుకొన్న తర్వాత, యెహోవాను ప్రార్థించటానికి వెళ్లింది. యెహోవా పవిత్ర ఆలయ ద్వారం పక్కనే యాజకుడు ఏలీ ఆసీనుడైవున్నాడు. హన్నా మిక్కిలి విచారంతో ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి ప్రార్థించింది. ఒక పెద్ద మొక్కుబడి మొక్కింది. “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నేను ఎంత దుఃఖంలో వున్నానో చూడు. నన్ను జ్ఞాపకముంచుకో! నన్ను మర్చిపోవద్దు. నాకొక కుమారుని కలుగజేస్తే వానిని నేను తిరిగి నీ సేవకై జీవితాంతం విడిచి పెడ్తాను. పైగా అతడు మద్యపానాది వ్యసనాలకు లోనుగాడు. అతడు నాజీరవుతాడు. మరియు అతని తలవెంట్రుకలు ఎవ్వరూ కత్తిపట్టి తీయరు” అని కోరుకున్నది. ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. హన్నా అంతరంగంలోనే ప్రార్థిస్తూవుంది. ఆమె పెదవులు కదిలాయి గాని ఆమె గొంతు విప్పలేదు. అందుచేత హన్నా మద్యం సేవించి వుంటుందని ఏలీ భావించాడు. “మద్యం తాగటం మానివేయి. నీ ద్రాక్షా రసాన్ని పారబోయి” అని హన్నాతో ఏలీ చెప్పాడు. “లేదయ్యా, నేను ద్రాక్షారసం గాని, మరేదిగాని సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో చెప్పుకుంటున్నాను. నేనొక చెడ్డ స్త్రీ నని తలంచవద్దు. ఇంత ఎక్కువ సేపు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానంటే నాకు ఎన్నో బాధలు, అంతులేని దుఃఖం ఉన్నాయి” అని హన్నా సమాధాన మిచ్చింది. అంతట ఏలీ, “నీవు సమాధానంతో వెళ్లు. ఇశ్రాయేలు దేవుడు నీ కోర్కెలను నెరవేర్చునుగాక” అని హన్నాను పంపివేశాడు. “నామీద దయ ఉంచండి” అని చెప్పి హన్నా వెళ్లి, కొంచెం ఆహారం తీసుకున్నది. ఆ తరువాత ఆమె మరెప్పుడూ అంత మనోవేదన చెందలేదు. మరునాటి తెల్లవారు ఝామునే ఎల్కానా కుటుంబ సభ్యులంతా లేచి దేవుని ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి వెళ్లిపోయారు. ఎల్కానా తన భార్య హన్నాతో శయనించాడు. హన్నాను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు. మరు సంవత్సరం సమయానికి హన్నా గర్భవతియై, ఒక కుమారుని కని తన కుమారునికి సమూయేలు అని పేరు పెట్టింది. “వీనిపేరు సమూయేలు. ఎందుకంటే వీని కొరకు నేను యెహోవాని ప్రార్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు” అని అన్నది హన్న. ఆ సంవత్సరం ఎల్కానా సకుటుంబంగా షిలోహుకు వెళ్లి, యెహోవాకు బలులు సమర్చించి, మొక్కిన మొక్కులు తీర్చేందుకు వెళ్లాడు. కాని ఈ సారి ఎల్కానాతో హన్నా వెళ్లలేదు. “బిడ్డకు ఆహారం తినే వయస్సు వచ్చిన్నపుడు షిలోహుకు తీసుకుని వెళతాను. అప్పుడతనిని దేవునికి అంకితం చేస్తాను. అతడు నాజీరు అవుతాడు. అది మొదలు శాశ్వతంగా షిలోహులో ఉండిపోతాడు” అని హన్నా ఎల్కానాకు చెప్పింది. “నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి. కుమారుడు స్వయంగా ఆహారం తినగలిగే వయస్సు వచ్చే వరకు ఇంటివద్దనే ఉండు. యెహోవా తన వాగ్దానం నెరవేర్చునుగాక” అని ఆమె భర్త ఎల్కానా అన్నాడు. తన కుమారుని పెంచుతూ హన్నా ఇంటి వద్దనే ఉండి పోయింది. బాలునికి స్వయంగా అన్నం తినే వయస్సు వచ్చినప్పుడు హన్నా అతనిని షిలోహులోని యెహోవా ఆలయానికి తీసుకుని వెళ్లింది. తనతోపాటు మూడు సంవత్సరాల గిత్తదూడను, అరబస్తా పిండిని, ఒక ద్రాక్షారసం సీసాను తీసుకుని వెళ్లినది. యెహోవా ముందరకు వెళ్లి ఎల్కానా యథావిధిగా కోడెదూడను యెహోవాకు బలిగా వధించాడు. అప్పుడు హన్నా బాలుని ఏలీ వద్దకు తీసుకుని వెళ్లింది. అప్పుడామె ఏలీతో, “అయ్యా, నీ జీవము తోడుగా చెప్పుచున్నాను; నేను గతంలో నీ చెంత నిలబడి యెహోవాకి ప్రార్థించిన స్త్రీనే, ఈ బిడ్డ కోసమే నేను ప్రార్థించాను. యెహోవా నా ప్రార్థన ఆలకించి ఈ బిడ్డను నాకు ప్రసాదించాడు. ఇప్పుడు ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వీడు జీవితాంతం యెహోవా సేవలో నిమగ్నమై ఉంటాడు” అని అన్నది. హన్న తన కుమారుని అక్కడ వదిలి యెహోవాను ఆరాధించింది.

Read 1 సమూయేలు 1