పేతురు వ్రాసిన మొదటి లేఖ 2:1-12

పేతురు వ్రాసిన మొదటి లేఖ 2:1-12 TERV

అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి. అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు. ప్రభువు మంచివాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు. మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను! పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది. ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!” ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు: “ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది.” మరొక చోట యిలా వ్రాయబడి ఉంది: “ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది. ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.” దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు. కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు. పూర్వం మీరు దేవుని ప్రజ కాదు. ఇప్పుడు మీరు దేవుని ప్రజ. పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు. కాని యిప్పుడు లభించింది. ప్రియమైన సోదరులారా! ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా, యాత్రికుల్లా జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలి వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. యూదులుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక గలిగి జీవించాలి. ఎందుకంటే, “దుర్మార్గులని” మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు.