కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7:17-24

కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7:17-24 TERV

ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదించిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం ప్రభువు నియమించిన ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా ఉండాలి. ఈ నియమాన్ని అన్ని సంఘాలు పాటించాలని ఆజ్ఞాపిస్తున్నాను. సున్నతి చేయించుకొన్నవాడు దేవుని పిలుపును అంగీకరిస్తే, అతడు ఆ సున్నతి లేనివానిగా ఉండుటకు ప్రయత్నించరాదు. సున్నతి చేయించుకొననివాడు దేవుని పిలుపును అంగీకరిస్తే అతడు సున్నతి చేయించుకోవటానికి ప్రయత్నం చేయరాదు. సున్నతి చేయించుకొన్నా, చేయించుకోక పోయినా జరిగేది ఏమిలేదు. దేవుని ఆజ్ఞల్ని పాటించటం ముఖ్యం. ప్రతి ఒక్కడూ, దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు నీవు బానిసవా? చింతించకు. కాని నీవు స్వేచ్ఛ పొందగలిగితే అందుకు ప్రయత్నం చేయి. ప్రభువు పిలిచినప్పుడు బానిసగా ఉన్నవాడు, ప్రభువులో ఐక్యత పొందటంవల్ల స్వేచ్ఛను పొందుతాడు. అదే విధంగా ప్రభువు పిలిచినప్పుడు స్వేచ్ఛగా ఉన్నవాడు ప్రభువుకు బానిస అవుతాడు. మీకోసం వెల చెల్లించి దేవుడు మిమ్మల్ని కొన్నాడు. మానవులకు బానిసలు కాకండి. సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి దేవునితో కలిసి ఉండండి.