మోసపోకండి, “చెడు సహవాసం మంచివాణ్ణి చెడుపుతుంది.” మేలుకోండి. పాపం చెయ్యటం మానుకొండి. మీలో కొందరికి దేవుణ్ణి గురించి తెలియదు. అది సిగ్గుచేటు. కొందరు, “చనిపోయినవాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” అని అడగవచ్చు. ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు. నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు. దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు. మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం. ఆకాశంలో జ్యోతులున్నాయి, భూమ్మీద జ్యోతులున్నాయి, గాని వాటి వాటి ప్రకాశం వేరు. సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు. చనిపోయినవాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి, నశించని శరీరాన్ని పొందుతారు. గౌరవం లేని శరీరంగా నాటబడి, మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి, శక్తిగల శరీరముగా లేస్తుంది. భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు. భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది. ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.” ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది. మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు. భూమ్మీద ఉన్నవాళ్ళు మట్టితో సృష్టింపబడినవానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించినవాళ్ళు పరలోకంనుండి వచ్చినవానివలె ఉన్నారు. మట్టితో సృష్టింపబడినవాని పోలికలతో మనము జన్మించినట్లే, పరలోకం నుండి వచ్చినవాని పోలికలను కూడా మనము పొందుతాము. సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు. మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు. చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయినవాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది. ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి. ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది: “మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.” “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ? ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?” మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రంనుండి పొందుతుంది. కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు. కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృథాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి.
చదువండి కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15
వినండి కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15:33-58
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు