కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:21-40

కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:21-40 TERV

లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “ఇతర భాషలు మాట్లాడేవాళ్ళ ద్వారా, విదేశీయుల పెదాల ద్వారా వీళ్ళతో నేను మాట్లాడుతాను. అయినా వాళ్ళు నా మాటలు వినరు.” తెలియని భాషల్లో మాట్లాడగల శక్తివుంటే, అది విశ్వాసం లేనివాళ్ళకు రుజువుగా ఉంటుంది. కాని ఆ రుజువు విశ్వాసం ఉన్నవాళ్ళకు అవసరం లేదు. అయినా దైవసందేశం విశ్వాసం ఉన్నవాళ్ళకే గాని, విశ్వాసం లేనివాళ్ళకు కాదు. సంఘంలో ఉన్నవాళ్ళందరూ ఒకేచోట సమావేశమై, తమకు తెలియని భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారనుకోండి. అప్పుడు సభ్యులు కానివాళ్ళు లేక విశ్వాసం లేనివాళ్ళు ఆ సమావేశంలో ఉంటే మీకు పిచ్చి ఎక్కిందని అనుకోరా? దానికి మారుగా మీరంతా దైవసందేశాన్ని చెపుతున్నారనుకోండి. అప్పుడు విశ్వాసం లేనివాడో లేక సభ్యుడు కానివాడో సమావేశంలో ఉంటే మీరు చెపుతున్నది విని తప్పు తెలుసుకుంటాడు. అంటే దైవసందేశం అతనిపై తీర్పు చెప్పిందన్నమాట. అతని మనస్సులో ఉన్న ఆలోచనలు బయట పడతాయి. అతడు మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా యిక్కడ మీతో ఉన్నాడు” అని అంగీకరిస్తాడు. సోదరులారా! యిక మేము ఏమని చెప్పాలి? మీరంతా సమావేశమైనప్పుడు ఒకడు స్తుతిగీతం పాడుతాడు. మరొకడు ఒక మంచి విషయాన్ని బోధిస్తాడు. ఇంకొకడు దేవుడు తనకు తెలియచేసిన విషయాన్ని చెపుతాడు. ఒకడు తనకు తెలియని భాషలో మాట్లాడుతాడు. మరొకడు దాని అర్థం విడమరచి చెపుతాడు. ఇవన్నీ సంఘాన్ని బలపరచటానికి జరుగుతున్నాయి. తెలియని భాషల్లో మాట్లాడగలిగేవాళ్ళు ఉంటే, ఇద్దరు లేక ముగ్గురి కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఒకని తర్వాత ఒకడు మాట్లాడాలి. దాని అర్థం విడమర్చి చెప్పగలవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేకపోయినట్లయితే తెలియని భాషలో మాట్లాడేవాడు మాట్లాడటం మానెయ్యాలి. అతడు తనలో తాను మాట్లాడుకోవచ్చు. లేదా దేవునితో మాట్లాడవచ్చు. దైవసందేశాన్ని యిద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు. మిగతావాళ్ళు చెప్పినదాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ అక్కడ కూర్చున్నవాళ్ళకు దేవుడు తన సందేశాన్ని చెప్పమంటే, మాట్లాడుతున్నవాడు మాట్లాడటం ఆపివెయ్యాలి. అలా చేస్తే ఒకరి తర్వాత ఒకరు దైవసందేశం చెప్పవచ్చు. అలా చెయ్యటం వల్ల అందరూ నేర్చుకొంటారు. ప్రతీ ఒక్కరికి ప్రోత్సాహం కలుగుతుంది. దైవసందేశం చెప్పేవాళ్ళు తమ ప్రేరణను అదుపులో పెట్టుకోవచ్చు. దేవుడు శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు. ఇతర సంఘాలలో జరుగుతున్నట్లు స్త్రీలు సమావేశాలలో మౌనం వహించాలి. మాట్లాడటానికి వాళ్ళకు అధికారం లేదు. ధర్మశాస్త్రంలో, “స్త్రీలు అణకువతో ఉండాలి” అని వ్రాయబడి ఉంది. స్త్రీలు సంఘంలో మాట్లాడటం అవమానకరం. కనుక ఒకవేళ స్త్రీ ఒక విషయాన్ని గురించి తెలుసుకోదలిస్తే, తమ ఇండ్లలో తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాలి. దైవసందేశం మీ నుండి ప్రారంభం కాలేదు. అది మీకు మాత్రమే లభించలేదు. దేవుడు తన ద్వారా సందేశం పంపాడన్నవాడు, లేక తనలో ఆత్మీయ శక్తి ఉందని అనుకొన్నవాడు నేను మీకు వ్రాసినది ప్రభువు ఆజ్ఞ అని గుర్తించాలి. అతడు యిది గుర్తించకపోతే దేవుడు అతణ్ణి గుర్తించడు. సోదరులారా! దైవసందేశం చెప్పాలని ఆశించండి. తెలియని భాషలో మాట్లాడేవాళ్ళను ఆపకండి. కాని అన్నిటినీ చక్కగా, సక్రమమైన పద్ధతిలో జరపండి.