కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:13-25

కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:13-25 TERV

కనుక తనకు తెలియని భాషల్లో మాట్లాడేవాడు తాను మాట్లాడిన వాటికి అర్థం చెప్పగలిగే శక్తినివ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే నేను నాకు తెలియని భాషల్లో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది కాని నా బుద్ధి అందులో పాల్గొనదు. మరి నేను ఏం చెయ్యాలి? నేను నా ఆత్మతో మాత్రమే కాక, నా బుద్ధితో కూడా ప్రార్థిస్తాను. నా ఆత్మతోను నా మనస్సుతోను కూడా పాడుతాను. మీరు దేవుణ్ణి ఆత్మతో స్తుతిస్తున్నారనుకోండి. మీ సమావేశంలో సభ్యుడు కానివాడుంటే, అతనికి మీరు ఏమంటున్నారో తెలియదు. కనుక, మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎప్పుడు, “ఆమేన్” అని అనాలో అతనికి ఎట్లా తెలిస్తుంది? మీరు సక్రమంగా స్తుతించినా ఆ వ్యక్తికి దాని వల్ల మేలు కలుగదు. మీ అందరికంటే ఎక్కువగా యితర భాషల్లో మాట్లాడగలందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. నేను సంఘంలో మాట్లాడినప్పుడు తెలియని భాషల్లో పదివేల పదాలు మాట్లాడటం కన్నా నాకు తెలిసిన భాషల్లో ఐదు పదాలు ఉపయోగించి బోధించటం ఉత్తమమని నా అభిప్రాయము. సోదరులారా! చిన్నపిల్లలవలె ఆలోచించకండి. చెడు విషయంలో చిన్నపిల్లల్లా ఉండండి. కాని ఆలోచించేటప్పుడు పెద్దవాళ్ళలా ఆలోచించండి. లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “ఇతర భాషలు మాట్లాడేవాళ్ళ ద్వారా, విదేశీయుల పెదాల ద్వారా వీళ్ళతో నేను మాట్లాడుతాను. అయినా వాళ్ళు నా మాటలు వినరు.” తెలియని భాషల్లో మాట్లాడగల శక్తివుంటే, అది విశ్వాసం లేనివాళ్ళకు రుజువుగా ఉంటుంది. కాని ఆ రుజువు విశ్వాసం ఉన్నవాళ్ళకు అవసరం లేదు. అయినా దైవసందేశం విశ్వాసం ఉన్నవాళ్ళకే గాని, విశ్వాసం లేనివాళ్ళకు కాదు. సంఘంలో ఉన్నవాళ్ళందరూ ఒకేచోట సమావేశమై, తమకు తెలియని భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారనుకోండి. అప్పుడు సభ్యులు కానివాళ్ళు లేక విశ్వాసం లేనివాళ్ళు ఆ సమావేశంలో ఉంటే మీకు పిచ్చి ఎక్కిందని అనుకోరా? దానికి మారుగా మీరంతా దైవసందేశాన్ని చెపుతున్నారనుకోండి. అప్పుడు విశ్వాసం లేనివాడో లేక సభ్యుడు కానివాడో సమావేశంలో ఉంటే మీరు చెపుతున్నది విని తప్పు తెలుసుకుంటాడు. అంటే దైవసందేశం అతనిపై తీర్పు చెప్పిందన్నమాట. అతని మనస్సులో ఉన్న ఆలోచనలు బయట పడతాయి. అతడు మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా యిక్కడ మీతో ఉన్నాడు” అని అంగీకరిస్తాడు.