కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి. మీరు తెలివిగలవాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా? రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము. ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చినదాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా? మరి నేను చెపుతున్నదానికి అర్థం ఏమిటి? విగ్రహాల్లో కాని, ఆరగింపు చేసిన ప్రసాదంలో కాని, ఏదో ప్రత్యేకత ఉందని చెపుతున్నానా? లేదు. నేను చెపుతున్నది ఏమిటంటే యూదులుకానివాళ్ళు బలిపీఠాలపై బలి ఇచ్చినవి దయ్యాల కోసం బలి ఇవ్వబడ్డాయి. అవి దేవునికి అర్పితం కావు. మీరు దయ్యాలతో భాగస్వాములు కారాదని నా విన్నపం. మీరు ప్రభువు పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా త్రాగాలని ప్రయత్నించరాదు. మీరు ప్రభువు పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ దయ్యాల పంక్తిలో కూడా కూర్చోవటానికి ప్రయత్నం చేయరాదు. మనం దేవుని కోపాన్ని రేపటానికి ప్రయత్నిద్దామా? మనం ఆయన కంటే శక్తిగలవాళ్ళమా? ఎన్నటికీ కాదు. “మనకు ఏది చెయ్యటానికైనా స్వేచ్ఛ ఉంది” కాని అన్నీ లాభదాయకం కావు. “మనకు అన్నీ చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు. ఎవరూ తమ మంచి కొరకే చూసుకోరాదు. ఇతరుల మంచి కోసం కూడా చూడాలి. మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి. “ఎందుకంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ ప్రభునివే.” క్రీస్తును విశ్వసించనివాడు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది ఉంచితే అది తినండి. కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి. అంటే, మీ మనస్సు కోసం అని కాదు, ఆ చెప్పినవాని మనస్సు కోసం దాన్ని తినకండి. నా స్వాతంత్ర్యం విషయంలో అవతలివాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి? నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి? కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి. యూదులకు గాని, యూదులుకానివాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, కష్టం కలిగించకుండా జీవించండి. నేను చేస్తున్నట్లు మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసుకోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింపబడాలని నా ఉద్దేశ్యం.
చదువండి కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10
వినండి కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10:14-33
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు