రూతు 2:1-9

రూతు 2:1-9 IRVTEL

నయోమి భర్తకు ఒక బంధువు ఉన్నాడు. అతడు చాలా భాగ్యవంతుడు. అతడు కూడా ఎలీమెలెకు వంశం వాడే. అతని పేరు బోయజు. మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది “నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.” అప్పుడు నయోమి “అలాగే అమ్మా, వెళ్ళు” అంది. ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది. బోయజు బేత్లెహేము నుండి వచ్చి పంట కోస్తున్న పనివారితో “యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక” అన్నాడు. అప్పుడు ఆ పనివారు తిరిగి బోయజుతో “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక” అన్నారు. అప్పుడు బోయజు పంట కోస్తున్న వాళ్ళపై అజమాయిషీ చేస్తున్న పనివాడితో “ఆ అమ్మాయి ఎవరు?” అని అడిగాడు. అతడు “ఆమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీ యువతి. ఆమె ‘నేను పంట కోత కోసే వాళ్ళ వెనకాలే వెళ్ళి పనల మధ్య నేలపై పడే పరిగె ఏరుకుని పోగు చేసుకోవడానికి అనుమతి నివ్వండి’ అని నన్ను అడిగింది. ఆమె వచ్చి పొద్దుటినుంచి పరిగె ఏరుకుంటూనే ఉంది. కొంచెం సేపు మాత్రం విశ్రాంతి తీసుకుంది” అని చెప్పాడు. అప్పుడు బోయజు రూతుతో “అమ్మాయీ, వింటున్నావా, వేరే పొలంలో పరిగె ఏరుకోడానికి వెళ్ళ వద్దు. ఇక్కడే పనిచేస్తున్న పనికత్తెల దగ్గరే ఉండు. కోత పనివారు పంట కోస్తున్న చేను కనిపెట్టుకుని పనికత్తెల వెనకే వెళ్తూ ఉండు. నిన్ను తాకకూడదని యువకులను ఆదేశించాను. నీకు దాహం వేస్తే నీటికుండల దగ్గరికి వెళ్లి మా పనివాళ్ళు చేదిన నీళ్ళు తాగు” అని చెప్పాడు.