రోమా పత్రిక 8:12-25

రోమా పత్రిక 8:12-25 IRVTEL

కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము. మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు. దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం. మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం. ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు? మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.

రోమా పత్రిక 8:12-25 కోసం వీడియో