అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి. కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే. మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను. అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు? మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే. అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా. దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు. అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది. వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి. రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి. వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి. వారికి శాంతిమార్గం తెలియదు. వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.” ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.
Read రోమా పత్రిక 3
వినండి రోమా పత్రిక 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: రోమా పత్రిక 3:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు