ప్రకటన గ్రంథం 18:4-24

ప్రకటన గ్రంథం 18:4-24 IRVTEL

తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది. “నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి. ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి. దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి. ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతులు కలపండి. ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి. ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను. సంతాపం చూడనే చూడను” అనుకుంది. కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి. దేవుడైన ప్రభువు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది.” ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు. “అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా, శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా” అంటూ ఏడుస్తారు. లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి విలపిస్తారు. ఎందుకంటే, ఇక మీదట తమ వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు. వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతం, ఎంతో విలువైన చెక్క, ఇత్తడి, ఇనుము, పాల రాళ్ళూ మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి, గోదుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు. “నీ మనస్సు ఆశించిన ఫలం నిన్ను విడిచి పోయింది. నీ విలాసం, వైభోగం మాయమై పోయాయి. అవి ఇక కనపడవు” అని చెబుతూ ఏడుస్తారు. ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన చూసి భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు. “సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారంతో, రత్నాలతో, వెల గల నగలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా, అయ్యో, అయ్యో, ఇంత ఐశ్వర్యమూ ఒక్క గంటలోనే మాయమైపోయిందే!” అంటారు. ప్రతి నౌకాధిపతి, సముద్ర యాత్రికులు, ఓడ నావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి నగరం తగలబడి పోతుంటే రాజుకున్న పొగను చూసి, “ఈ మహా నగరానికి సమానమైనదేది?” అంటూ కేకలు పెడతారు. తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, “అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే” అంటారు. “పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు.” ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, “ఇలాగే మహా నగరమైన బబులోను కూడా హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు. కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు. దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారుగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.” ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది.

ప్రకటన గ్రంథం 18:4-24 కోసం వీడియో