ప్రకటన గ్రంథం 13:4-18

ప్రకటన గ్రంథం 13:4-18 IRVTEL

ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. “ఈ మృగంలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగల వారెవరు?” అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు. బడాయి మాటలూ దైవ దూషణలూ చేసే నోరూ వాడికి ఉంది. నలభై రెండు నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది. కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన పేరునీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి వాడు నోరు తెరిచాడు. ఇంకా పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రతి వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడే వారిపైనా, ప్రతి జాతి పైనా అధికారం వాడికివ్వడం జరిగింది. భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు. మీకు చెవులుంటే వినండి! చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు. కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు. పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనం, విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు. వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు. పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ వాడు బలవంతం చేశాడు. ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం. ఇందులో జ్ఞానం ఉంది. వివేకి అయినవాడు ఆ మృగం సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666.

ప్రకటన గ్రంథం 13:4-18 కోసం వీడియో