కీర్తన 22:22-31

కీర్తన 22:22-31 IRVTEL

నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను. యెహోవా పట్ల భయం ఉన్నవారలారా, ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని ఘనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని చూసి విస్మయం చెందండి. ఆయన బాధపడే వాళ్ళ బాధను తృణీకరించలేదు, వాళ్ళను చూసి ఆయన అసహ్యపడలేదు. అతనినుంచి తన ముఖం దాచుకోలేదు. బాధలో ఉన్నవాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు. మహా సమాజంలో నీ నుండి నా స్తుతి వస్తుంది. ఆయనపట్ల భయభక్తులు కలిగిన వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను. బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక. భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన ఎదుట వంగి నమస్కారం చేస్తాయి. ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుతున్న వాళ్ళందరూ ఆరాధిస్తారు. తమ సొంత ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళు, మట్టిలోకి దిగిపోతున్న వాళ్ళందరూ ఆయన ఎదుట వంగి నమస్కరిస్తారు. రానున్న ఒక తరం వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. తమ తరవాతి తరానికి ప్రభువును గురించి చెబుతారు. వాళ్ళు వచ్చి ఆయన న్యాయ విధానం గురించి చెబుతారు. ఆయన క్రియలను ఇంకా పుట్టని వారికి చెబుతారు!