కీర్తన 18:16-36

కీర్తన 18:16-36 IRVTEL

పైనుంచి చెయ్యి చాపి ఆయన నన్ను అందుకున్నాడు. దూసుకొచ్చే జలప్రవాహాలనుంచి నన్ను బయటకు లాగాడు. నన్ను ద్వేషించే నా బలమైన శత్రువులనుంచి ఆయన నన్ను రక్షించాడు. ఎందుకంటే వాళ్ళను ఎదుర్కొనే బలం నాకు లేదు. ఆపత్కాలంలో వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు. విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకు వచ్చాడు. నన్నుబట్టి ఆయన సంతోషించాడు గనక ఆయన నన్ను రక్షించాడు. నా నిర్దోషత్వాన్నిబట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా చేతులు పరిశుభ్రంగా ఉన్నాయి గనక ఆయన నన్ను పునరుద్ధరించాడు. ఎందుకంటే యెహోవా మార్గాలు నేను అనుసరించాను. దుర్మార్గంగా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన న్యాయవిధులన్నీ నా ఎదుట ఉన్నాయి. ఆయన శాసనాలనుంచి నేను వెనుదిరగలేదు. పాపం నుంచి నేను దూరంగా ఉన్నాను. ఆయన దృష్టిలో నేను యథార్ధంగా ఉన్నాను. కాబట్టి, నేను నిర్దోషిగా ఉన్న కారణంగా, తన దృష్టిలో నా చేతులు పరిశుభ్రంగా ఉన్న కారణంగా యెహోవా నన్ను పునరుద్ధరించాడు. నిర్దోషుల పట్ల నిన్ను నువ్వు నిర్దోషివిగా కనపరచుకుంటావు. నమ్మదగిన వాళ్ళ పట్ల నువ్వు నమ్మదగిన వాడివిగా కనపరచుకుంటావు. స్వచ్ఛంగా ఉన్నవాళ్ళ పట్ల నిన్ను నువ్వు స్వచ్ఛంగా కనపరచుకుంటావు. అయితే వక్రబుద్ధి గలవాళ్ళ పట్ల వికటంగా ఉంటావు. బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు! నా దీపానికి వెలుగును ఇచ్చేవాడివి నువ్వే. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు. నీవల్ల నేను అడ్డంకులను అధిగమించగలను. నా దేవుని వల్ల అడ్డుగోడలు దూకగలను. దేవుని విషయమైతే, ఆయన పరిపూర్ణుడు. యెహోవా వాక్కు స్వచ్ఛమైనది. ఆయనలో ఆశ్రయం పొందిన వాళ్లకు ఆయన ఒక డాలు. యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుడు తప్ప ఆశ్రయశిల ఏది? ఒక నడికట్టులాగా నాకు బలం ధరింపజేసేవాడు ఆయనే. నిరపరాధిని తన మార్గంలో నడిపించేవాడు ఆయనే. ఆయన నాకాళ్లు జింక కాళ్లలా చురుగ్గా చేస్తున్నాడు, కొండలమీద నన్ను ఉంచుతున్నాడు. నా చేతులకు యుద్ధం చెయ్యడం, ఇత్తడి విల్లును వంచడం నేర్పిస్తాడు. నీ రక్షణ డాలును నువ్వు నాకిచ్చావు. నీ కుడిచెయ్యి నన్ను ఆదుకుంది, నీ దయ నన్ను గొప్పచేసింది. జారిపోకుండా నా పాదాలకింద స్థలం విశాలం చేశావు.