కీర్తన 119:145-160

కీర్తన 119:145-160 IRVTEL

యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు. నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు. తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు. దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు. యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను. నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు. నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు. భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది. యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు. నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను. ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు. నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి.