కీర్తన 106:1-15

కీర్తన 106:1-15 IRVTEL

యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది. యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు? న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకున్నవారి క్షేమం నేను చూస్తూ నీ ప్రజలకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ, నీ వారసత్వ ప్రజతో కలిసి కొనియాడేలా నీ ప్రజల పట్ల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు. మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము. ఈజిప్టులో మా పూర్వీకులు నీ అద్భుతాలను గ్రహించలేదు. నీ కృపాబాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోలేదు. సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వారు తిరుగు బాటు చేశారు. అయినా తన మహా పరాక్రమాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన తన నామాన్నిబట్టి వారిని రక్షించాడు. ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్టు ఆయన వారిని అగాధజలాల్లో నడిపించాడు. పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు. నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి. వారిలో ఒక్కడైనా మిగల్లేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. ఆయన కీర్తిని గానం చేశారు. అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు. అరణ్యంలో వారు ఎంతో ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. అయినా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలగజేశాడు.