కీర్తన 104:1-17

కీర్తన 104:1-17 IRVTEL

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు. ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు. జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు. వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు. భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి. నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి. నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి. అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు. ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి. అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి. వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి. తన మేడ గదుల్లోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది. పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు. యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి. అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి.