సామెత 3:13-26

సామెత 3:13-26 IRVTEL

జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు. వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం. రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది. జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి. దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు. తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు. ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి. కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు. జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి. అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు. పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు. అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు. యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు.