సామెత 1:10-19

సామెత 1:10-19 IRVTEL

కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు. దుష్టులు నీతో “మాతో చేతులు కలుపు. ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం. అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం. ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం. దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి. నువ్వు మాతో కలసి ఉండు, మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం” అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్యపెట్టవద్దు. కుమారా, నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్ళ వద్దు. వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాదాలు అదుపులో ఉంచుకో. మనుషులను చంపడానికి వాళ్ళు తొందరపడుతూ ఉంటారు. హాని కలిగించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం. వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు. తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు. అక్రమ ఆర్జన ఆశించే వాళ్లకు ఇదే గతి పడుతుంది. ఆ మార్గంలో నడిచే వాళ్ళ ప్రాణాలు అదే తీస్తుంది.