నెహెమ్యా 6:1-9

నెహెమ్యా 6:1-9 IRVTEL

నేను పగుళ్ళు ఏవీ లేకుండా గోడలు కట్టే పని పూర్తి చేశాను. ఇంకా తలుపులు నిలబెట్టలేదు. ఈ విషయం సన్బల్లటుకూ, టోబీయాకూ, అరబ్బు వాడు గెషెంకూ, ఇంకా మా శత్రువుల్లో మిగతా వారికి తెలిసింది. సన్బల్లటు, గెషెంలు నాకు ఎలాగైనా కీడు తలపెట్టాలని చూశారు. “ఓనో మైదానంలో ఎదో ఒక చోట మనం కలుసుకుందాం, రండి” అని మాకు కబురు పంపారు. అప్పుడు నేను “నేను చేస్తున్న పని మహత్తరమైనది. ఆ పని ఆపేసి మీ దగ్గరికి ఎందుకు రావాలి?” అని నా మనుషులతో జవాబు పంపాను. వాళ్ళు అదే విధంగా నాలుగుసార్లు నాకు కబురు పంపించారు, నేను కూడా ముందు చెప్పినట్టుగానే జవాబిచ్చాను. ఐదవసారి సన్బల్లటు తన పనివాడి ద్వారా ఒక బహిరంగ లేఖ నాకు పంపించాడు. ఆ ఉత్తరంలో “యూదులపై రాజుగా ఉండాలని నువ్వు సరిహద్దు గోడలు కడుతున్నావు. ఆ కారణం వల్ల నువ్వు, యూదులు కలసి రాజు మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు. ‘యూదులకు రాజు ఉన్నాడు’ అని నిన్ను గూర్చి ప్రకటించడానికి యెరూషలేంలో కొందరు ప్రవక్తలను నువ్వు నియమించావని, ఇంకా ఇతర విషయాలు రాజుకు తెలిశాయన్న పుకార్లు బయలుదేరాయి. అన్య జాతుల ప్రజల మధ్య ఈ పుకార్లు గెషెం లేవదీస్తున్నాడని తెలిసింది. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించడానికి మనం కలుసుకుందాం” అని రాసి ఉంది. ఇలా చేస్తే మేము బెదిరిపోయి పని చేయలేక నీరసించిపోతాం అని వాళ్ళు భావించారు. “మేము ఎప్పటికీ ఇలాంటి పనులు చెయ్యం. వీటన్నిటినీ నీ మనస్సులో నువ్వే కల్పించుకున్నావు” అని అతనికి జవాబు పంపాను. దేవా, ఇప్పుడు నా చేతులకు బలమియ్యి.