వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు. ఆయన వాళ్లతో, “మనుష్య కుమారుణ్ణి శత్రువుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను చంపుతారు. మూడు రోజుల తరువాత ఆయన తిరిగి బతికి వస్తాడు” అని అన్నాడు. కానీ యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు. వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, “దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?” అని అడిగాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప, అని వాదించుకున్నారు. యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, “మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు. అప్పుడాయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇలా అన్నాడు, “నా పేరిట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరించేవారు నన్ను కాదు, నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు.” యోహాను ఆయనతో, “బోధకా! ఒకడు నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనవాడు కాదు. అందువల్ల అతన్ని అడ్డగించాం” అన్నాడు. అయితే యేసు, “అతనిని ఆపకండి. నా పేరట అద్భుతం చేసే వాడెవడూ నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు. మనకు వ్యతిరేకంగా లేని వాడు మన పక్షంగా ఉన్నవాడే. మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు క్రీస్తుకు చెందిన వారని గుర్తించి నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు. “కాని, నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్నబిడ్డకి ఎవరైనా అడ్డుబండగా ఉంటే అతని మెడకు పెద్ద తిరగలి రాయి కట్టి, అతన్ని సముద్రంలో పడవేయడం అతనికి మేలు. మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. రెండు కళ్ళు ఉండి నరకంలో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు. నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి ఒక్కరూ మంటల మూలంగా ఉప్పు సారం పొందుతారు. ఉప్పు మంచిదే కాని దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి” అని చెప్పాడు.
చదువండి మార్కు 9
వినండి మార్కు 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 9:30-50
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు