మార్కు 9:1-13

మార్కు 9:1-13 IRVTEL

ఆయన వారితో, “నేను మీతో కచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు. దానికంటే ముందు వారు మరణించరు” అని అన్నాడు. ఆరు రోజుల తరవాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి. అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు. పేతురు యేసుతో, “రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి” అన్నాడు. తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.” వెంటనే వారు తమ చుట్టూ చూశారు, యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు. వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకూ మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు. అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకుని, “చనిపోయి తిరిగి బ్రతకడం” గురించి తమలో తాము చర్చించుకున్నారు. అప్పుడు వారు, “ఏలీయా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు?” అని ఆయనను అడిగారు. యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మనుష్య కుమారుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది? నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.