మార్కు 8:1-10

మార్కు 8:1-10 IRVTEL

ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమిగూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి, “ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు. వారిని ఇప్పుడు పంపివేస్తే వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారుగనక దారిలో సొమ్మసిల్లి పోవచ్చు” అని అన్నాడు. ఆయన శిష్యులు, “ఈ నిర్జన ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడ నుండి తేగలం?” అన్నారు. “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని ఆయన వారిని అడిగాడు. వారు, “ఏడు” అన్నారు. యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు. వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు. ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు. తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వారిని పంపివేసి, వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.