మార్కు 7:14-37

మార్కు 7:14-37 IRVTEL

అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరికి పిలిచి, “నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని అర్థం చేసుకోండి! బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు. మనిషి లోనుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది” అని అన్నాడు. ఆయన జనసమూహన్ని విడిచి ఇంట్లో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా? బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదని మీరు గ్రహించలేరా? అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది” అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పవిత్రమైనవే అని యేసు సూచించాడు). ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.” యేసు ఆ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు. ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది. ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది. అందుకు యేసు ఆమెతో, “మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు” అని అన్నాడు. అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!” అని జవాబు ఇచ్చింది. అప్పుడాయన ఆమెతో, “ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. దయ్యం నీ కూతురిని వదలిపోయింది” అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది. యేసు తూరు, సీదోను ప్రాంతం నుంచి బయలుదేరి దెకపొలి ప్రాంతం గుండా గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు. అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరికి తీసుకు వచ్చి అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. యేసు అతన్ని జనంలో నుండి పక్కకి తీసుకు వెళ్ళి తన వేళ్ళు అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు. అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, “ఎప్ఫతా” అని అతనితో అన్నాడు. ఆ మాటకు, “తెరుచుకో!” అని అర్థం. వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ సంగతి ఎవ్వరితోనూ చెప్పవద్దని యేసు అతనికి ఆజ్ఞాపించాడు కాని, ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దాన్ని చాటించారు. ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు, “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.

మార్కు 7:14-37 కోసం వీడియో