మార్కు 15:1-26

మార్కు 15:1-26 IRVTEL

తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు. పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ప్రశ్నించాడు. అందుకు యేసు, “నువ్వే అంటున్నావుగా” అని అతనికి జవాబిచ్చాడు. ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు. కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, “వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు! నీవేమీ జవాబు చెప్పవా?” అన్నాడు. అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. బరబ్బ అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఉన్నాడు. జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు. పిలాతు, “యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అని అన్నాడు. ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు. కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు. పిలాతు, “అలాగైతే ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు?” అని అడిగాడు. వారు కేకలు వేస్తూ, “సిలువ వేయండి” అన్నారు. పిలాతు, “ఎందుకు? అతడు చేసిన నేరమేంటి?” అన్నాడు. జనసమూహం, “సిలువ వేయండి” అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు. సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు. వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు. ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు. రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు. ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు. వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం. అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు. ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు. ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు. “యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు.