ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు. కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు. వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకు వెళ్ళారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు. పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు. ముఖ్య యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గానీ అది వారికి దొరకలేదు. చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు. కాని, వారి సాక్షాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ, “ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, “నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా!” అని యేసును ప్రశ్నించాడు. కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?” అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు. అప్పుడు యేసు, “నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం, పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు” అన్నాడు. ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, “ఇంకా మనకు సాక్షాలతో ఏం పని? ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు. అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి, ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది, “ఎవరో ప్రవచించు” అన్నారు. భటులు కూడా ఆయనను కొట్టారు. పేతురు ఇంటి లోగిట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని పనిపిల్ల అక్కడకు వచ్చింది. పేతురు చలి కాచుకుంటూ అక్కడ ఉండడం చూసి, “నజరేతు వాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావుగదా!” అని అతనితో అంది. పేతురు కాదన్నాడు. “నేను ఆయనను ఎరగను. నీవేం అంటున్నావో నాకు అర్థం కావడం లేదు” అని అన్నాడు. ఆ వెంటనే లేచి ఆవరణలోకి వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది. ఆ పనిపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వారితో, “ఇతడు వారిలో ఒకడు” అంది. పేతురు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి పక్కన నిలుచున్నవారు అతనితో, “నిజమే! నువ్వు వాళ్ళలో ఒకడివే. ఎందుకంటే నువ్వు కూడా గలిలయ వాడివే కదా!” అన్నారు. అయితే పేతురు, “మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు” అంటూ తనను తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే రెండోసారి కోడి కూసింది. ‘కోడి రెండు సార్లు కూసే ముందే నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు’ అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. అతడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు.
చదువండి మార్కు 14
వినండి మార్కు 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 14:51-72
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు