మార్కు 14:37-42

మార్కు 14:37-42 IRVTEL

ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, “సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా? మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది” అన్నాడు. ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు. మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు. వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.”