మార్కు 12:1-27

మార్కు 12:1-27 IRVTEL

ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. “ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి, అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్షతోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూర దేశానికి వెళ్ళాడు. పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్షపండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు. అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు. అతడు మళ్ళీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతని తలపై గాయపరచి, అవమానించి పంపివేశారు. అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతణ్ణి చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు. కాని, ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి, ఇంకొందరిని చంపారు. వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియ కుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకుని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు. కాని ఆ కౌలుదారులు ‘ఇతడే వారసుడు! ఇతన్ని చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది’ అని తమలో తాము మాట్లాడుకున్నారు. వారు అతన్ని పట్టుకుని, చంపి ఆ ద్రాక్షతోట అవతల పారవేశారు. అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు. మీరు ఈ లేఖనం చదవలేదా? ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది. అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’” ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు కాని, ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు. యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు. వారు వచ్చి ఇలా అన్నారు, “బోధకా! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? మనం పన్నులు కట్టాలా? మానాలా?” అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, “నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకు రండి” అన్నాడు. వారు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని ఆయన అడిగాడు. వారాయనతో, “సీజరుది” అన్నారు. అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు. “బోధకా, ఒకడి సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకుని, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో రాశాడు. ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు. రెండవవాడు ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వాడికి కూడా అలాగే జరిగింది. ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళిచేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వారు తిరిగి బ్రతికినపుడు ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకున్నారు కదా!” అని అడిగారు. యేసు వారికి జవాబిస్తూ, “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు. చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే, మోషే తాను రాసిన గ్రంథంలో ‘పొదను గురించిన భాగం’ రాసినప్పుడు దేవుడతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు. తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు” అన్నాడు.