మార్కు 11:1-14

మార్కు 11:1-14 IRVTEL

వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు. “మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంతవరకూ దాని మీద ఎవరూ ఎన్నడూ స్వారీ చెయ్యలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ఇది ప్రభువుకు అవసరం’ అనండి. వెంటనే అతడు దాన్ని పంపిస్తాడు.” శిష్యులు వెళ్ళి, ఒక ఇంటి ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి, దాన్ని విప్పుతుండగా అక్కడ ఉన్న కొందరు వారితో, “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అని అడిగారు. శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుషులు వారిని వెళ్ళనిచ్చారు. వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరికి తీసుకు వచ్చి తమ వస్త్రాలను దాని మీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. చాలామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరిచారు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు. ముందు, వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు! రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం!” అని బిగ్గరగా కేకలు వేశారు. యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న అన్నిటినీ చూశాడు. అప్పటికే పొద్దుపోవడం వల్ల ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కలిసి బేతనీకి వెళ్ళాడు. మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు” అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు.

మార్కు 11:1-14 కోసం వీడియో