ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు. అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది. యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మాయ్, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది” అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు. “వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు. ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది. ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది. యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, “దావీదు కుమారా, మామీద దయ చూపించు” అని కేకలు వేశారు. యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, “నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని వారిని అడిగాడు. వారు, “అవును ప్రభూ” అన్నారు. అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, “మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది” అన్నాడు. వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి” అని ఖండితంగా వారికి చెప్పాడు. కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.
చదువండి మత్తయి 9
వినండి మత్తయి 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 9:18-31
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు