మత్తయి 5:22-42

మత్తయి 5:22-42 IRVTEL

అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు. “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో. నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు. నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో. చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను. “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. “‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు. నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. “‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా. అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం. నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు. మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే. “‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి. ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు. నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.