మత్తయి 27:32-44

మత్తయి 27:32-44 IRVTEL

వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు. వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు. అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు. వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు. “ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు. ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు. అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, “ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు. ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు.