మత్తయి 27:15-31

మత్తయి 27:15-31 IRVTEL

ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక. ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు. కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?” ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది. ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు. పిలాతు, “ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడగగా వారు, “బరబ్బనే” అని అరిచారు. అందుకు పిలాతు, “మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?” అన్నాడు. వారంతా, “అతణ్ణి సిలువ వేయండి” అని కేకలు వేశారు. పిలాతు, “ఎందుకు? ఇతడు ఏం నేరం చేశాడు?” అని అడిగినప్పుడు, వారు, “సిలువ వేయండి” అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు. అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు. అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు. వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు. ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు. అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు.