సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. వారు భోజనం చేస్తుండగా ఆయన, “మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, “ప్రభూ, అది నేనా?” అని ఆయనను అడగడం ప్రారంభించారు. ఆయన, “నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు.
మనుష్య కుమారుణ్ణి గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది” అని వారితో చెప్పాడు. ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.
వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు.
అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే,
‘కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి’ అని రాసి ఉంది కదా!
కాని నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అన్నాడు.
అందుకు పేతురు, “నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను” అని యేసుతో చెప్పాడు. యేసు అతణ్ణి చూసి, “నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు” అన్నాడు. పేతురు ఆయనతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.
ఆ తరువాత, యేసు వారితో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. ఆయన, “నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకూ మీరు ఇక్కడే కూర్చోండి” అని వారితో చెప్పాడు. పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు. అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు.
ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు. శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా? మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం” అని పేతురుతో అన్నాడు.
యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు. ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి.
ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు. అప్పుడాయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు, “మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా? వినండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది. ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు.”
ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి. ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు. యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.
వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు. అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా? నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు.