మత్తయి 24:32-51

మత్తయి 24:32-51 IRVTEL

“అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు. అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు. “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు. నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది. జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు. జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది. ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది. ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా! మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. “ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు? యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు. ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే, అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”