యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు, “పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది. ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు.
అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు. కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు. మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు.
కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. అప్పుడతడు, ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు. కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు. ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది.
“రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు. రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు. కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు. ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”
అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు. వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, “బోధకా, నీవు యథార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ, ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు. సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు.
యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు? ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు. ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు. ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.