మత్తయి 21:33-46

మత్తయి 21:33-46 IRVTEL

“ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు. కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు. ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు. చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు. అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు. వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు. ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు. వారు “అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు. అప్పుడు యేసు వారితో, “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా? “కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను. ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది” అన్నాడు. ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు, పరిసయ్యులు గ్రహించారు. వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.