మత్తయి 21:19-32

మత్తయి 21:19-32 IRVTEL

అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, “ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!” అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది. అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!” అని చెప్పుకున్నారు. అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు” అని వారితో చెప్పాడు. ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు. యేసు, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?” అని వారిని అడిగాడు. అప్పుడు వారు, “మనం పరలోకం నుండి, అని చెబితే, ‘మీరెందుకు యోహానును నమ్మలేదు?’ అంటాడు. మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకుని, “మాకు తెలియదు” అన్నారు. అప్పుడాయన “అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను” అన్నాడు. ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, ‘బాబూ, పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి’ అన్నాడు. అతడు, ‘నేను వెళ్ళను’ అని జవాబిచ్చాడుగానీ తరవాత మనసు మార్చుకుని వెళ్ళాడు. అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, ‘నేను వెళతాను’ అన్నాడుగానీ వెళ్ళలేదు. ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?” అని వారిని అడిగాడు. వారు, “మొదటివాడే” అని జవాబిచ్చారు. యేసు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడ లేదు, అతనిని నమ్మలేదు.