యేసు యెరూషలేముకు వెళ్ళబోయే ముందు తన పన్నెండు మంది శిష్యులనూ ఏకాంతంగా తీసుకుపోయి, దారిలో వారితో ఇలా అన్నాడు. “ఇదిగో, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకూ ధర్మశాస్త్ర పండితులకూ అప్పగిస్తారు. వారు ఆయనకి మరణశిక్ష విధించి. ఆయనను అవమానించడానికీ కొరడా దెబ్బలు కొట్టడానికీ సిలువ వేయడానికీ యూదేతరులకు అప్పగిస్తారు. అయితే మూడవ రోజున ఆయన సజీవంగా తిరిగి లేస్తాడు.” అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది. “నీకేమి కావాలి?” అని యేసు ఆమెను అడిగాడు. అందుకామె, “నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులను ఒకణ్ణి నీ కుడి వైపున, మరొకణ్ణి నీ ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు” అంది. అందుకు యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?” అని వారిని అడగగా వారు “తాగగలం” అన్నారు. ఆయన, “నా గిన్నెలోది మీరు తాగుతారు గానీ, నా కుడి వైపున, ఎడమ వైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి” అని చెప్పాడు. మిగిలిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు. కాబట్టి యేసు వారిని పిలిచి, “ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు. కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి. మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు. వారు యెరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది. అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని కేకలు వేశారు. ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని ఇంకా పెద్దగా కేకలు వేశారు. యేసు ఆగి, వారిని పిలిచి, “మీకోసం నన్నేమి చేయమంటారు?” అని అడిగాడు. వారు, “ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు” అన్నారు. యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.
చదువండి మత్తయి 20
వినండి మత్తయి 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 20:17-34
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు